Social Icons

Pages

C.Narayana Reddy(ప్రియుడి గుండెలో నాదం)

పిల్లకాలువలా మొదలై మహా ప్రవాహంలా మారుతుందా ప్రేమికుడి ప్రేమావేశం.
అలా ఉప్పొంగే భావాలకు స్వరూపమే 'శివరంజనీ నవరాగిణి' పాట.
ఆ పాట రాసిన నాటి సంగతులు మనతో ఇలా చెబుతున్నారు గీత రచయిత,
జ్ఞానపీట్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి.

ప్రియుడి గుండెలో నాదం

అటువైపు నిర్మాత రాఘవ .... ఇటువైపు దర్శకులు దాసరి నారాయణరావు. మధ్యలో నేనూ సంగీత దర్శకులు రమేష్ నాయుడు! 'తూర్పు-పడమర' చిత్రం కోసం ఓ పాట రాయడానికి కూర్చున్నాం. తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'అపుర్వరాగంగల్' దీనికి మాతృక. అందులోని 'అతిశయరాగం ఆనందరాగం' అనే పాట అప్పట్లో తమిళనాట సూపర్ హిట్. అదే మ్యూజిక్ ట్రాక్ కి డబ్బింగ్ పాట రాసేద్దాం అన్నారు రాఘవ . నాకు ఇష్టం లేదు! ఎందుకంటే ఒక సృజనాత్మక గీతరచనకు అవకాశమున్న సన్నివేశానికి డబ్బింగ్ పాట రాయాల్సిన అవసరమేముంది? ఈ మాటే రాఘవతో చెప్పాను. దాసరిదీ ఇదే అభిప్రాయం.రాఘవా...ఆ సందర్భంలో కొత్తబాణీ కొత్త పాట ఉంటేనే బాగుంటుంది' అన్నారు రమేష్ నాయుడు. రాఘవ కాసేపు ఆలోచించి మాకో సవాలు విసిరారు! 'అతిశయరాగం ఆనందరాగం కంటే గొప్పపాట ఇవ్వగలం' అనే నమ్మకం మీలో వుంటే ప్రయత్నించండి' అన్నారు. ఆ మాటని నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను. 'అంత కంటే గొప్పపాట అవుతుందో లేదో తెలీదుగానీ దాని స్థాయికి తగ్గకుండా మాత్రం ఇవ్వగలం' అని రాఘవతో అన్నాను. 'అయితేసరే' అన్నారు రాఘవ. అప్పుడు ఆపాట వచ్చే సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నాను...

రాగంతో మొదలై .....
కథానాయకుడు నరసింహరాజు, కథానాయిక శ్రీవిద్య .... వయసులో హీరోకంటే పెద్ద ! ఆ సినిమాలో శ్రీవిద్య గాయని. ఆమెను అమితంగా అభిమానిస్తాడు ఆరాధిస్తాడు హీరో. వాళ్ళిద్దరి మధ్య ఉన్నవయసుల తేడా మరచి తనలోని ప్రేమను ఆమెకు తెలపాలనుకుంటాడు. ఇదీ నేను పాట రాయాల్సిన సందర్భం. కాసేపు ఆలోచించి 'ఈ సందర్భానికి మీరు ఏ రాగంలో స్వరకల్పన చేస్తే బాగుంటుందనుకుంటున్నారు' అని రమేష్ నాయుణ్ణి అడిగాను .ఆయన 'శివరంజని' అన్నారు. అప్పటికి ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఇంకా ఏ పేరూ అనుకోలేదు. దాసరిని 'హీరోయిన్ పాత్ర పేరేంట'ని అడిగాను.ఆయన నవ్వుతూ 'శివరంజని 'అన్నారు. ఇద్దరినోటా అదే మాట. ఇక నా వంతు, 'శివరంజనీ నవరాగిణీ వినినంతనే నా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహినీ ...'అంటూ మొదలుపెట్టాను. ఇక్కడ 'వినినంతనే' అని ఎందుకు రాశానంటే... శివరంజని రాగాన్ని ఉద్దేశించి కథానాయకుడు తన భావాలను నాయికకు చెబుతున్నాడు. అతడిలోని ప్రేమావేశం పెరిగేకొద్దీ పాట ప్రయాణం ఉద్ధృతం చేయాలన్నది నా ఆలోచన.

రాగం రాగిణిగా
'రాగాల సిగలోన సిరిమల్లివి' అంటూ మొదటి చరణం మొదలౌతుంది. ఇందులో శివరంజని రాగం గొప్పతనాన్ని మాధుర్యాన్ని మాత్రమే వర్ణిస్తాడు కథానాయకుడు. రాగం పరిధి దాటడు. రెండో చరణానికి వచ్చేసరికి ఆ పరిధి చెరిపేస్తాడు. రాగం స్థానంలో తన ప్రణయ రాగిణిని ప్రతిష్టించేస్తాడు. ఆమె అంగాంగ వర్ణన మొదలుపెడతాడు. అందుకే ఆ చరణం 'ఆ కనులు పండు వెన్నెల గనులు ' అంటూ సాగుతుంది. కనులూ కురులూ అంటూ నెమ్మదిగా సౌందర్యోన్మాదిగా మారిపోతుంటాడు కథానాయకుడు. అలా మారుతున్నకొద్దీ కథానాయిక వర్ణన మరింత పెరగాలి. ధారావాహికంగా సాగిపోవాలి. అక్కడే పాట మరో మలుపు తిరిగింది.
సందర్భంలో నా కళ్ళముందు రెండు ఘట్టాలు కదిలాయి. విల్లు విరచిన రామచంద్రుని మెడలో వరమాల వేస్తున్న సీతా గుర్తొచ్చింది. అయినవారందర్నీ కాదని తాను వరించిన శ్రీకృష్ణునితో రథమెక్కిన రుక్మిణి కళ్ళముందు కదలాడింది. ఆ భావనలే 'జనకుని కొలవున అల్లనసాగే జగన్మోహినీ జానకీ...' అంటూ రాశాను. అయినా కథానాయకుడు శాంతించలేదు. ఇంకా ఆవేశంగా వర్ణించాలి. అప్పుడు రాశాను... 'రాశీకృత నవరసమయ జీవన రాగాచంద్రికా' అని. ఇంకా ఆగని అతడి ప్రేమావేశం 'నీవే నీవే నాలోపలికే నాదానివి...' అంటూ పతాక స్థాయికి చేరిపోతుంది.
రాఘవకూ దాసరికీ మా అందరికీ ఆ పాట నచ్చేసింది. దాన్ని సంగీత ప్రియుల గుండెలకు అంత చేరువ చేసేలా పాడిన ఘనత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి దక్కుతుంది.

పల్లవి:
శివరంజనీ నవరాగిణీ
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృతవాహినీ ఆ.......11శివరంజనీ11
చరణం 1 :
రాగాల సిగలోన సిరిమల్లివి
సంగీత గగనాన జాబిల్లివి
స్వరాసురఝురీ తరంగానివి
సరసహృదయ వీణావాణివి

11శివరంజనీ11
చరణం 2 :

ఆ కనులూ పండువెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాలవనులు
ఆ వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధర మధుకలశం

11శివరంజనీ11
చరణం 3 :
జనకుని కొలువున అల్లనసాగే
జగన్మోహినీ జానకీ
వేణుధరుని రథమారోహించిన
విదుషీమణి రుక్మిణీ
రాశీకృత నవరసమయ జీవన రాగాచంద్రికా....
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా
రావే....
రావే నా శివరంజనీ.... మనోరంజనీ
రంజనీ నా రంజనీ
నీవే నీవే నాలో పలికే నాదానివీ
నీవే నాదానివీ నీవే నా దానివీ
 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs