Social Icons

Pages

Devulapalli Krishnasastri( November 1, 1897 – February 24, 1980) - Poet, Playwright & Translator


దేవులపల్లి కృష్ణశాస్త్రి (1897-1980) ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం.
జీవిత విశేషాలు:
దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో 1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్టి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. పిఠాపురం హైస్కూలులో అతని విద్యాభ్యాసం సాగింది. పాఠశాలలో తన గురువులు కూచి నరసింహం, రఘుపతి వెంకటరత్నం గార్లు ఆంగ్ల సాహిత్యంలో తనకు అభిరుచి కల్పించారని దేవులపల్లి చెప్పుకొన్నాడు. 1918లో విజయనగరం వెళ్ళి డిగ్రీ పూర్తి చేసి తిరిగి కాకినాడ పట్టణం చేరాడు. పెద్దాపురం మిషన్ హైస్కూలులో ఉపాధ్యాయవృత్తి చేపట్టాడు. ఆ కాలంలో వ్యావహారిక భాషావాదం, బ్రహ్మసమాజం వంటి ఉద్యమాలు ప్రబలంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రి తన అధ్యాపకవృత్తిని వదలి బ్రహ్మసమాజంలో చురుకుగా పాల్గొన్నాడు. అదేసమయంలో సాహితీ వ్యాసంగం కూడా కొనసాగించాడు. 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. 1922లో భార్యా వియోగానంతరం అతని రచనలలో విషాదం అధికమయ్యింది. తరువాత మళ్ళీ వివాహం చేసుకొని, పిఠాపురం హైస్కూలులో అధ్యాపకునిగా చేరాడు. కాని పిఠాపురం రాజుగారికి కృష్ణశాస్త్రి భావాలు నచ్చలేదు. కృష్ణశాస్త్రి ఆ ఉద్యోగం వదలి బ్రహ్మసమాజంలోను, నవ్య సాహితీసమితిలోను సభ్యునిగా, భావ కవిత్వోద్యమ ప్రవర్తకునిగా దేశమంతటా ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో ఎందరో కవులతోను, పండితులతోను పరిచయాలు కలిగాయి. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. పిఠాపురంలోని హరిజన వసతి గృహంతో సంబంధం ఏర్పరచుకొని హరిజనోద్ధరణ కార్యక్రమాలలో పాల్గొన్నందున బంధువులు అతనిని వెలివేశారు. అయినా వెనుకాడని కృష్ణశాస్త్రి వేశ్యావివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించాడు. సంఘ సంస్కరణా కార్యక్రమాళు నిర్వహిస్తూనే "ఊర్వశి" కావ్యం వ్రాశాడు. 1929లో విశ్వకవి రవీంద్రనాధ టాగూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సాహితీ సంబంధాలు ఏర్పడ్డాయి. 1933-41 మధ్య కాలంలో కాకినాడ కాలేజీలో తిరిగి అధ్యాపకవృత్తిని చేపట్టాడు. 1942లో బి.ఎన్.రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశాడు. తరువాత అనేక చిత్రాలకు సాహిత్యం అందించాడు. 1957లో (1947లో?) ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించాడు. గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరుపొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్యకారణంగా మూగవోయింది. కాని అతని రచనా పరంపర కొనసాగింది. అతనికి అనేక సన్మానాలు ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించాడు. కృష్ణశాస్త్రి మేనగోడలే కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ అవసరాల (వింజమూరి) అనసూయాదేవి.
పురస్కారాలు:
1975 - ఆంధ్ర విశ్వవిద్యాలయం - కళాప్రపూర్ణ
1978 -సాహిత్య అకాడమీ అవార్డు
1976 - పద్మ భూషణ్
ప్రముఖుల అభిప్రాయాలుమహాకవి శ్రీశ్రీ - నేను కృష్ణశాస్త్రి కవితాశైలినే అనుకరించేవాడిని. కానీ, మా నారాయణబాబు కృష్ణశాస్త్రి సింహం జూలునుకూడా అనుసరించి, దాన్ని రోజూ సంపెంగ నూనెతో సంరంక్షించుకునేవాడు. నాకెప్పుడూ పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేదికాదు.
విశ్వనాథ సత్యనారాయణ - మనకు కీట్సు, షెల్లీ, వర్ద్సు వర్తులవంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా యభిప్రాయము.
రచనలు:
కృష్ణ శాస్త్రి చేసిన పెక్కు రచనల్లో కొన్ని.
కృష్ణ పక్షము : ఇది కృష్ణశాస్త్రి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్య ఘట్టం. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం. 1922లో సంభవించిన భార్యా వియోగం ఆయన కవితలను మరింత వేదనా భరితం చేసింది.ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, ప్రవాసము, ఊర్వశి వంటి కవితలు ఈ ఖండకావ్యసంపుటిలో ఉన్నాయి.
సినిమా పాటలు: మల్లీశ్వరి తో ప్రారంభించి కృష్ణశాస్త్రి ఎన్నో చక్కని సినిమా పాటలు అందించారు. అవి సామాన్యులనూ, పండితులనూ కూడా మెప్పించే సాహితీ పుష్పాలు. ఉదాహరణకు
సీతామాలక్ష్మి - మావి చిగురు తినగానే కోయిల పలికేనా
మేఘ సందేశం - ఆకులో ఆకునై, పూవులో పూవునై
గోరింటాకు - గోరింట పూచింది కొమ్మ లేకుండా
కార్తీక దీపం - ఆరనీకుమా ఈ దీపం
కృష్ణ పక్షము
అమృతవీణ - 1992 - గేయమాలిక
అమూల్యాభిప్రాయాలు - వ్యాసావళి
బహుకాల దర్శనం - నాటికలు,కధలు
ధనుర్దాసు - నాలుగు భక్తి నాటికలు
కృష్ణశాస్త్రి వ్యాసావళి - 4 భాగాలు
మంగళకాహళి - దేశభక్తి గీతాలు
శర్మిష్ఠ - 6 శ్రవ్య (రేడియో) నాటికలు
శ్రీ ఆండాళ్ళు తిరుప్పావు కీర్తనలు, నాటిక 1993
మేఘమాల - సినిమా పాటల సంకలనం - 1996
శ్రీ విద్యావతి - శృంగార నాటికలు
యక్షగానాలు - అతిథిశాల - సంగీత రూపకాలు
మహతి
వెండితెర పాటలు - 2008
మల్లీశ్వరి సినిమానుండి
మనసున మల్లెల మాలలూగెనే -
కనుల వెన్నెల డొలలూగెనే -
ఎంత హాయు ఈరేయి నిండెనో -
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో -
కొమ్మల గువ్వల సవ్వడి వినినా -
రెమ్మల గాలుల సవ్వడి వినినా -
ఆలలు కొలనులొ గలగల మనినా -
డవుల వేణువు సవ్వడి వినినా -
నీవు వచ్చెవని నీపిలుపె విని -
కన్నుల నీరెడి కలయ చూచితిని -
గడియె యుక విడిచి పోకుమ -
ఎగసిన హృదయము పగులనీకుమ -
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో -
ఎంత హాయు ఈరేయి నిండెనో -
ఒక దేశభక్తి గీతం---
భారత మాతజయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ, దివ్యధాత్రి!
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి!
జయ జయ జయ.....

జయ జయ సశ్యామల సుశ్యామల చలచ్చేలాంచల!
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల!
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా!
జయ జయ జయ.......

జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ!
జయ గాయక వైతాళిక గళవిశాల పథవిహరణ!
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ!
జయ జయ జయ.......

ఈ గీతాన్ని ఆయన కాకినాద ప్రభుత్వ కలాసాలలొ లెక్చరర్ గా పనిఛెస్తున్నప్పుడు వారి విద్యార్దులకోసం వ్రాసారు.

కృష్ణపక్షము నుండి
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ?
నా యిచ్చయే గాక నా కేటి వెరపు ?
కాలవిహంగమ పక్షముల దేలియాడి
తారకా మణులలో తారనై మెరసి
మాయ మయ్యెదను నా మధురగానమున!
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు ? (స్వేచ్ఛాగానము)
తలిరాకు జొంపముల సం
దులత్రోవల నేల వాలు తుహినకిరణ కో
మల రేఖవొ! పువుదీవవొ!
వెలదీ, యెవ్వతెవు నీపవిటపీ వనిలోన్ ? (అన్వేషణము)
సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?
చంద్రికలనేల వెదజల్లు చందమామ?
ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? (ఏల ప్రేమింతును?)
ప్రసిద్ధి చెందిన సినిమా పాటలు:
పిలచిన బిగువటరా, -- మనసున మల్లెల మాలలు, --- నోమి నమ్మాల్లాలా --- ఆకాశ వీధిలో హాయిగా --- ఔనా.. నిజమేనా? ---- పరుగులు తీయాలి - మల్లీశ్వరి (1951)
సడి సేయకో గాలి - రాజ మకుటం (1961)
ప్రతి రాత్రి వసంత రాత్రి - ఏకవీర (1969)
రానిక నీకోసం. . సఖీ - మాయని మమత (1970)
ఈ గంగ కెంత దిగులు - శ్రీరామ పట్టాభిషేకం (1978)
నేటికి మళ్ళి మా ఇంట్లో - వాడే వీడు (1973)
ముందు తెలిసినా ప్రభూ --- ఆకులో ఆకునై --- మేఘ సందేశం (1982)
ఆరనీకుమా ఈ దీపం - కార్తీక దీపం (1979)
గోరింట పూచింది --- ఎలా ఎలా.. దాచావు? - గోరింటాకు (1979)
పగలైతే దొరవేరా ---- మనిషే మారేరా.. రాజా - బంగారు పంజరం (1969)
సరిగమపదనిసా..పలికే వారుంటే - కళ్యాణ మండపం (1971)
గట్టుకాడ ఎవరో - బంగారు పంజరం (1969)
ఒక్క క్షణం ఒక్క క్షణం - కలసిన మనసులు (1968)
కుశలమా.. నీకు కుశలమేనా - బలిపీఠం (1975)
చాలులే నిదురపో --- చుక్కలతో చెప్పాలని.. --- అడుగడుగున గుడి ఉంది ---- రావమ్మా మహాలక్ష్మి.. - ఉండమ్మా బొట్టు పెడతా - (1968)
మనిషైతే మనసుంటే - అమాయకుడు (1968)
నా పేరు బికారి --- ఆకాశ పందిరిలో - శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976)
ఎవరు నేర్పేరమ్మ... ఈ కొమ్మకు - ఈనాటి బంధం ఏనాటిదో (1977)
వేళ చూస్తే.. సందె వేళ - జగత్ కిలాడీలు (1969)
చీకటి వెలుగుల కౌగిటిలో - చీకటి వెలుగులు (1975)
పాడనా తెనుగు పాట - అమెరికా అమ్మాయి (1976)
ఇది మల్లెల వేళయనీ - సుఖదుఃఖాలు (1968)
మావిచిగురు తినగానే - సీతామాలక్ష్మి (1978)
నామాల తాతయ్యే నీకు నాకు అందరికీ - నామాల తాతయ్య (1979)
దూరాన దూరాన తారా దీపం.... - మా బంగారక్క (1977)
ఎవరైనా చూశారా? - అమ్మ మాట (1972)
కొలువైతివా రంగ సాయి - ఆనంద భైరవి (1984)
ఘనా ఘనా సుందరా.. - భక్త తుకారాం (1973)
రామా.. ఓ.. రామా - రాముడే దేముడు (1973)
 

Bhajans

Kids Telugu Rhymes

Private & Folk Songs